Saturday, April 18, 2026

గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు

గజ్వేల్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు దిశానిర్దేశం చేశారు.

డీజీపీ ముఖ్య సందేశం

సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై వాహనదారులు పాటించాల్సిన కీలక సూత్రాలను వివరించారు: “మనం ఆలోచించే లోపే ప్రమాదం జరిగిపోతుంది. ఆ సమయంలో మనకు రియాక్షన్ టైమ్ కూడా ఉండదు, అందుకే అప్రమత్తత చాలా ముఖ్యం.” హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడూ ఎడమ వైపు మాత్రమే వెళ్లాలి. కేవలం ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయంలో మాత్రమే కుడి వైపు ట్రాక్‌ను ఉపయోగించాలి. ఓవర్‌టేక్ చేసిన వెంటనే మళ్ళీ ఎడమ వైపునకు వచ్చేయాలి. ప్రస్తుత పర్యటనల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే ఈ నిబంధన పాటిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో ఎదురుగా వాహనం వచ్చినప్పుడు తప్పకుండా లో-బీమ్ కు మారాలి. వాహనం దాటే వరకు లో-బీమ్‌లోనే ఉండాలి. అలాగే గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు కూడా లో-బీమ్ ఉపయోగించడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, ముఖ్యంగా దాని స్ట్రాప్ ను గట్టిగా పెట్టుకోవాలి. అలాగే కారులో ప్రయాణించే వారందరూ (ముందు, వెనుక సీట్లలో) తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. గ్రామీణ రోడ్ల నుండి హైవేపైకి వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ఆగి, హైవేపై వెళ్లే వాహనాలకు దారి ఇచ్చిన తర్వాతే లోపలికి రావాలి. పరిసరాలను గమనిస్తూ, రోడ్డు మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి వాహనం నడపాలని, పెద్ద వాహనాలకు వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు.

పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సందేశం

కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్  మాట్లాడుతూ వాహనదారులకు భావోద్వేగపూరితమైన పిలుపునిచ్చారు. “అరైవ్ అలైవ్’ అంటే కేవలం ఒక ప్రచారం కాదు.. సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తానని మీరు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చే వాగ్దానం.” ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలను మాత్రమే కాకుండా, తమ కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యుల భవిష్యత్తును కూడా కాపాడుతారని పేర్కొన్నారు. వాహనదారులు అతివేగానికి వెళ్లకుండా నియంత్రించుకోవాలని, రోడ్డుపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఎదుటి వాహనాల కదలికలను ముందే అంచనా వేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం అనేది తనతో పాటు తోటి వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయడమేనని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.

జిల్లా కలెక్టర్ హైమావతి ప్రసంగం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నేడు ఈ ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్‌ను కూడా జోడించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని, రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించడం, పరిమితికి మించి లోడ్‌తో వాహనాలను నడపడం వంటి పనులు ప్రాణాంతకమని, వీటిని ఖచ్చితంగా మానుకోవాలని ఆమె సూచించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా ప్రమాణాలు మరియు ట్రాఫిక్ నిబంధనల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!