Saturday, April 18, 2026

నేరస్తుల కంటే ముందే పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి

– కరీంనగర్‌లో రోడ్డు భద్రత వారోత్సవాలు మరియు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం.

– కరీంనగర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న డీజీపీ.

– సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపు.

– ప్రతిభ కనబరిచిన అధికారులకు నగదు రివార్డుల ప్రధానం.

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీసు శాఖ నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” (Arrive – Alive) రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ విచ్చేశారు. రోడ్డు భద్రత అవగాహన సదస్సు అనంతరం, కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కరీంనగర్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన రోజులను ఆయన నెమరువేసుకున్నారు.

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అప్రమత్తత

మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల సరళి మారుతోందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెను సవాలుగా మారాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మెటా ఫండ్’, ‘క్రిప్టో కరెన్సీ’ వంటి నేరాలు ఇక్కడి నుండే జరిగాయని గుర్తు చేస్తూ, ఇలాంటి ఎమర్జింగ్ క్రైమ్స్‌ను ఎదుర్కోవడానికి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను (Skills) నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

పీపీటీ ద్వారా నేరాల సమీక్ష

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిని, నేరాల తీరుతెన్నులను డీజీపీకి వివరించారు. కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న భద్రతా చర్యలను డీజీపీ అభినందించారు. కమిషనరేట్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులలో అత్యంత ప్రతిభ కనబరిచి, నిందితులను గుర్తించి వారికి శిక్షలు పడేలా చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి నగదు రివార్డులను


అందజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, సీఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!