Friday, April 17, 2026

ఫిష్ మార్కెట్‌లో బినామీల దందాకు చెక్

– జీహెచ్ఎంసీ నుంచి మత్స్య శాఖకు మార్కెట్ నిర్వహణ బదిలీ
– అర్హులైన మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దుకాణాలు కేటాయించాలి
– గత పదేళ్లలో పేదల పేరిట సాగిన బినామీల దోపిడీపై ఆధారాలున్నాయి
– మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ నేతలు
– వారం రోజుల్లో మార్కెట్‌ను పరిశీలిస్తానని మంత్రి హామీ

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి: కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ బాలాజీ నగర్ డివిజన్) లోని జీహెచ్ఎంసీ ఫిష్ మార్కెట్‌లో గత పదేళ్లుగా సాగుతున్న బినామీల దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. ఈ మార్కెట్‌ నిర్వహణను జీహెచ్ఎంసీ పరిధి నుంచి మత్స్య శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్, ముదిరాజ్ మరియు గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రాజు ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ ఫణీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ ఫిష్ మార్కెట్‌ను స్వయంగా పరిశీలించి, శిథిలావస్థలో ఉన్న మార్కెట్ భవనానికి మరమ్మతులు చేయించాలని వారు మంత్రికి విన్నవించారు. మార్కెట్‌లోని దుకాణాలను కేవలం దళారులకే కాకుండా, అర్హులైన గంగపుత్రులు, ముదిరాజ్‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి.. కచ్చితంగా వారం రోజుల్లో మార్కెట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
గత పదేళ్లలో బినామీల దోపిడీ..
గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో పాలకుల అండతో కేపీహెచ్‌బీ ఫిష్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని నేతలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. పేదల పేరుతో దుకాణాలు తీసుకుని, వాటిని తమ పార్టీకి చెందిన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీకి నెలకు కేవలం రూ. 1000 అద్దె చెల్లించాల్సి ఉండగా.. అక్రమార్కులు, బినామీలు మాత్రం వ్యాపారుల నుంచి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు దౌర్జన్యంగా వసూలు చేసి జేబులు నింపుకున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని వారు స్పష్టం చేశారు. గత జోనల్ కమిషనర్ మమత హయాంలోనే అధికారుల కనుసన్నల్లో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగిందని వారు ఆరోపించారు.
ఫలించిన రెండేళ్ల పోరాటం..
మార్కెట్లో దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ఫిష్ మార్కెట్‌ నిర్వహణను మత్స్య శాఖకు అప్పగించాలంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి బండి రమేష్ సహకారంతో గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేశామని నేతలు గుర్తుచేశారు. సంబంధిత మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించిన ఫలితంగానే.. నేడు జీహెచ్ఎంసీ నుంచి మత్స్య శాఖకు మార్కెట్ బదిలీ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్వహణను మత్స్య శాఖ పరిధిలోకి తేవడంతో, ఇకపై దళారీల ప్రమేయం లేకుండా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!