
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో గురువారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఏడు మంది పోలీసు సిబ్బందిని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ, రిటైర్ అయిన సిబ్బందికి పెన్షన్ పత్రాలు అందజేసి, పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ *యూనిఫాం పోలీస్‌కు రెండో చర్మంలాంటిదని, ప్రజల కన్నీరు తుడిచి, వారికి సేవలు అందించిన ప్రతి పోలీసు అధికారి పదవీ విరమణ సమయంలో గర్వపడాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి తన కుటుంబానికి రుణపడి ఉండాలన్నారు. పోలీసులు విధుల నిర్వహించే క్రమం లో వారి కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తు చేశారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, సమాజంలోని పౌరులతో సానుభూతితో, గౌరవంతో మెలగాలని సూచించారు. పదవీ విరమణ చేసిన పోలీసులు తమ అనుభవంతో పోలీస్ శాఖకు అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ బీ ఏడీసీపీ రవికుమార్ డిసీపీగా ప్రమోషన్ పొందినందుకు సీపీ అభినందనలు తెలిపారు.
తన పదవీ విరమణ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఒక కానిస్టేబుల్ కుమారుడిగా కెరీర్‌ను ప్రారంభించి, నేడు డీసీపీ స్థాయికి ఎదగడం పట్ల గర్వంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో శారీరక శ్రమతో పాటు ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’ మరియు మేధోపరమైన కృషి ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. తన విజయ ప్రస్థానంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు మరవలేనిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ట్రాఫిక్ 2 డీసీపీ రంజన్ రతన్ కుమార్, ఎస్‌బీ ఎస్‌ఐ పి. వెంకట్ రెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐ కె. మురళీధర్ సంగారెడ్డి జిల్లా అటాచ్‌మెంట్‌తో సీఏఆర్ హెడ్క్వార్టర్స్‌లో, ఏఆర్ఎస్‌ఐ ఎన్. కృష్ణ సీఏఆర్ హెడ్క్వార్టర్స్‌లో, ఏఎస్‌ఐ వి. వెంకట సూర్యనారాయణ రాజు ఈఓడబ్ల్యూ సైబరాబాద్‌లో, డి. రాములు మోకిల పోలీస్ స్టేషన్‌లో, అలాగే జి. అశోక్, బార్బర్, సీఏఆర్ హెడ్క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ తమ పదవీ విరమణ పొందారు. వీరి సేవలను అధికారులు అభినందిస్తూ, భవిష్యత్తులో ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం, ఎస్‌బి ఏడీసీపీ రవికుమార్, మరియు వివిధ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Recent Comments