Saturday, May 23, 2026

వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభం…

వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభం

530 మంది క్రీడాకారులతో జోష్‌గా ప్రారంభమైన జిల్లా స్థాయి పోటీలు

సూర్య ఉదయం కూకట్ పల్లి…

వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని ఎస్ ఎల్ వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్న జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ రావు, వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు, కోచ్‌లు, నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వికారాబాద్ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో క్రీడాకారులు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అభివృద్ధికి అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, కార్యదర్శి యు.వి.ఎన్. బాబు, సభ్యులు సుబ్బారెడ్డి, విజయ్‌కుమార్, పీవీఎల్ కుమార్, ఏ.వి. రమణా రెడ్డిలు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ జయంత్, ఎం. రామరాజు, సాయితేజలను అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ, ప్రోత్సాహం అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

వారి సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఏడాది ఏకంగా 530 మంది క్రీడాకారులు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. ఈ స్థాయిలో పాల్గొనడం వికారాబాద్ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడ పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ యువ క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, క్రీడాకారులు విజయం సాధించాలనే లక్ష్యంతో తమ ప్రతిభను కనబరిచారు. అధికారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.

జిల్లా బ్యాడ్మింటన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న నిర్వాహకులు, కోచ్‌లు, అసోసియేషన్ ప్రతినిధుల కృషితో ఈ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా ప్రారంభమై క్రీడా వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!