Sunday, May 24, 2026

పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ రితీరాజ్…

 

సమాజ రక్షణలో నిరంతరం శ్రమించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై సైబరాబాద్ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సిబ్బంది కోసం బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితీరాజ్ (IPS) ఆధ్వర్యంలో జరిగిన ఈ హెల్త్ క్యాంప్‌నకు విశేష స్పందన లభించింది.

శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తూ, మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్న పోలీసుల సంక్షేమం కోసం సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ తెలిపారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన ఈ శిబిరంలో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని బాలానగర్, కూకట్పల్లి, అల్లాపూర్ ప్రాంతాలకు చెందిన లా అండ్ ఆర్డర్, అలాగే ట్రాఫిక్ విభాగానికి చెందిన సుమారు 157 మంది పోలీస్ సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ప్రముఖ ‘సింధు హాస్పిటల్’ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు సిబ్బందికి కీలకమైన పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా పోలీసులలో ఒత్తిడి, జీవనశైలి లోపాలను గుర్తించేందుకు వీలుగా… విటమిన్-డి, విటమిన్-బి12, హెచ్‌బిఏ 1సీ (HbA1c), హిమోగ్లోబిన్ పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం వైద్యులు సిబ్బందికి ఆరోగ్య సూత్రాలను, తగిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి, బాలానగర్, అల్లాపూర్ పరిధిలోని సీఐలు, డీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం డీసీపీ రితీరాజ్, ఐపీఎస్, మాట్లాడుతూ.. “పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అందుకే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక హాస్పిటల్స్, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో తరచూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయడం, యోగా, ధ్యానం వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించిన సింధు హాస్పిటల్ బృందానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!