Saturday, August 1, 2026

కేపీహెచ్బీ కాలనీలో రాజకీయ రచ్చ.. 

– ఫ్లెక్సీ దహనం, పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత

– టీ న్యూస్ ప్రసారంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్ పల్లి:

తెలంగాణ లో పొలిటికల్ వాతావరణం మరోసారి హైటెక్కింది. హైదరాబాద్‌ కూకట్ పల్లి, కేపీహెచ్బీ కాలనీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన అంశాన్ని టీ న్యూస్ ఛానల్‌లో ప్రసారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో నాయకులు కేపీహెచ్బీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫోటోతో ఉన్న ఫ్లెక్సీకి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. టీ న్యూస్ అక్రమ సొమ్ముతో స్థాపించబడిందంటూ ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డెక్కిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు

టీ న్యూస్‌లో వచ్చిన ప్రచారం అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో మొదలై, ఇప్పుడు రోడ్డుపైకి చేరింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రెండు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కేపీహెచ్బీ కాలనీలో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ నాయకుడి బాగోతం బయటపెడతాం: బీఆర్ఎస్ వర్గాలు

ఈ సందర్భంగా స్పందించిన బీఆర్ఎస్ వర్గాలు, కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన అన్ని విషయాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని సమాచారం. తాము చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు.

టీ న్యూస్‌పై చట్టపరమైన చర్యలు: కాంగ్రెస్

మరోవైపు, టీ న్యూస్ ప్రసారంపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తమ లీగల్ టీమ్‌తో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. అసత్య ప్రచారం జరిగితే న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

పోలీసుల దృష్టికి ఘటన

ఫ్లెక్సీ దహనం, నినాదాలతో కొంతసేపు టెంపుల్ బస్ స్టాప్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

రాజకీయ వేడి మరింత పెరుగుతుందా?

సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు బహిరంగ నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల దాకా చేరుకోవడంతో కేపీహెచ్బీ రాజకీయం మరింత వేడెక్కింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!