Thursday, September 10, 2026

– బాలాజీ నగర్‌లో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం…

📰 Generate e-Paper Clip

తూతూమంత్రంగా కూల్చివేతలు… నిర్మాణం మాత్రం యథాతథం!

– బాలాజీ నగర్‌లో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం

– 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని జీ+5 పాటు పెంట్‌హౌస్ నిర్మాణం

– ప్లాట్ నంబర్ 39లోని ఈ నిర్మాణం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందంటున్న స్థానికులు

– అధికారులకు సవాల్ విసురుతున్న నిర్మాణదారుడు.. ‘ఏమీ చేయలేరు’ అన్న ధీమాతో ముందుకు?

 

సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్‌పల్లి:

 

కూకట్‌పల్లి సర్కిల్-52 పరిధిలోని బాలాజీ నగర్‌లో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం జీ+5తో పాటు పెంట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నారని వారు పేర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు చర్యలు తీసుకోవాలని తెలిపిన తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, నిర్మాణం మాత్రం యథాతథంగా కొనసాగుతుండటంపై కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

తూతూమంత్రంగా కూల్చివేతలు… నిర్మాణం యథాతథం

 

బాలాజీ నగర్ డివిజన్‌లోని హెచ్.నెం. 15-21-150/104, ప్లాట్ నంబర్ 39లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు తూతూమంత్రంగా, కూల్చివేత చర్యలు చేపట్టినట్లు కనిపించినా.. కొంత భాగం తొలగించిన భవన నిర్మాణదారుడు ఇంతేనా… ఏమి చేయలేరు అన్న ధీమాతో మళ్లీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు చేపడుతున్న చర్యలు కేవలం తూతూమంత్రంగా మారుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 

2 ఫ్లోర్లకు అనుమతి… జీ+5తో పాటు పెంట్‌హౌస్!

 

రెండు ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతి తీసుకుని, దానికి మించి జీ+5తో పాటు పెంట్‌హౌస్ నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణంలో అనుమతించిన పరిమితులను మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, భారీ నిర్మాణ పనుల కారణంగా చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

ప్లాట్ నంబర్ 39 నిర్మాణం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందా?

 

ప్లాట్ నంబర్ 39లో జరుగుతున్న నిర్మాణం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందనే అనుమానాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు భూమి స్వరూపం, ఎఫ్‌టీఎల్ పరిమితులు, నిర్మాణానికి మంజూరైన అనుమతులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు. నిర్మాణం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందా? లేదా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత శాఖలతో సంయుక్తంగా సర్వే నిర్వహించి వాస్తవాలను తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

అధికారులకు సవాల్ విసురుతున్న నిర్మాణదారుడు?

 

అధికారులు నిర్మాణాన్ని నిలిపివేయాలని సూచించినా, నిర్మాణ పనులు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నిర్మాణదారుడికి అధికారులపై ఎలాంటి భయం లేకపోయినట్టుగా కనిపిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు ఏమీ చేయలేరన్న ధీమాతోనే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం మౌనం వహించడం పలు ప్రశ్నలకు తావిస్తోందని కాలనీ వాసులు అంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లినా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

ఉన్నతాధికారులు స్పందించాలి

 

అనుమతులకు మించి నిర్మించిన నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్లాట్ నంబర్ 39లో మంజూరైన బిల్డింగ్ పర్మిట్, అనుమతించిన అంతస్తులు, నిర్మించిన అంతస్తులు, ఎఫ్‌టీఎల్ పరిధి తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు తేలితే అదనపు నిర్మాణాలను చట్టప్రకారం తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేస్తారా? లేక కేవలం తూతూమంత్రపు చర్యలతో సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments