• విద్యార్థులకు తగ్గిన దూర భారం
• హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
సూర్య ఉదయం,ఇచ్చోడ: మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న దృశ్య గత కొన్ని నెలల నుండి ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం గుండా వెళ్లకుండా, మండల కేంద్రానికి దూరంలో ఉన్న బస్టాండ్ వరకే రావడంతో ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం ఊరు చివరన ఉన్న బస్టాండ్ కు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. రాత్రి సమయాల్లో ఇతర ప్రదేశాల నుండి వచ్చే ప్రయాణికులు సైతం ఊరు చివరన ఉన్న బస్టాండ్ నుండి మండల కేంద్రంలోనికి రావాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంలో తడుసుకుంటూ బుడుదల నడుచుకుంటూ ఆర్టీసీ బస్సుల కోసం ఊరి చివరన ఉన్న బస్టాండ్ కి వెళ్లేందుకు అష్ట కష్టాలు పడ్డారు. అదేవిధంగా జనసంచారం మండల కేంద్రంలో లేకపోవడంతో చిరు వ్యాపారులు వ్యాపారం లేక పూట గడవడం గగనం అయ్యింది. మండల కేంద్రం గుండా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారుల, ప్రజలు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు ఇటీవల విన్నవించారు. ఎమ్మెల్యే చొరవతో ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం గుండా రాకపోకలు సాగించడంతో అటు ప్రయాణికులు, ఇటు చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు తగ్గిన దూర భారం…
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించడానికి మన్నూర్, గాంధీనగర్, జున్ని , దొంగార్ గామ్ దిగ్నూర్ , గంగాపూర్, బోస్రా , సాత్ నంబర్, ముఖ్రా తదితర గ్రామాల నుండి వందల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి మండల కేంద్రానికి వస్తుంటారు. ఊరు చివరన ఆర్టీసీ బస్టాండ్ ఉండటం అదే విధంగా ఆర్టీసీ బస్సులు మండల కేంద్రంలోనికి రాకపోవడంతో ఊరు చివరన ఉన్న బస్టాండ్ నుండి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థులు దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవారు. ఎమ్మెల్యే చొరవతో ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం గుండా రాకపోకలు సాగించడంతో తమకు దూర భారం తగ్గిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం గుండా రాకపోకలు సాగించడంతో మండల కేంద్రంలో కొంతమేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Recent Comments